
అడవిలో ~
నిశి రాత్రి
కొండలు కనుమలు
నీవు నీ గుర్రం
సాగి పోతున్న నీ ప్రయాణం
ఎన్నెన్నో దృశ్యాలు
మరెన్నో జ్ఞాపకాలు
కొండల నడుమ
వెయ్యి గుర్రాల డెక్కల
ప్రతిధ్వనులు
కాలుతున్న పొదలు
నవ్వులు
ఒకేసారి తటాలున లేచి ఎగురుతున్న
పక్షుల రెక్కల చప్పుళ్ళు
పరుచుకున్నట్టున్న ఆకాశంలో
నల్లని చీకటి పట్టుపరుపు
చెట్ల ఛాయల నిశ్శబ్దం
ఎవరో ఎదురుచూస్తున్నారు
కాపుకాస్తున్నారు .
జీవిత మర్మాల నిశ్చల సాక్షులు
నిద్రిస్తున్న కొండల నడుమ
సముద్రం అవతలి అంచుకు
చేరిన నక్షత్ర జలపాతం , ప్రవాహం .
మెత్తటి నేల దోసిట్లో , నీవు, నీ
ప్రయాణం . నీ సుఖానికే
ఆ నేల ప్రయత్నం
ఈ పయనంలో నే వస్తా
నీతో , సుదూర తీరాలకు
కాలాన్ని కప్పేసిన
ఆకాశాన్నంటే చెట్లు
మాటలేమరచిన అడవి
ప్రశ్నల వర్షంలో తడసిన
జవాబులు
అనాదినుంచున్న చెట్టు మొదల్లో
వేళ్ళని వెతికే నీతో వస్తా
నీతోనే ఉంటా , నీతోనే ఆట ,పాట
కడవరకు
చందమామ సముద్రంలో
కలిసే దగ్గర వరకు
నీతోనే వస్తా
ఆగు నాకోసం .
~ matcha








